తెలంగాణ

AmitShah: తెలంగాణపై బీజేపీ చాణక్యుడి గురి! అక్టోబర్ 4న రాష్ట్రానికి అమిత్ షా.. ఆ ఎన్నికలపైనే ఫోకస్!

AmitShah: తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ అధిష్టానం సరికొత్త సమరానికి శంఖారావం పూరిస్తోంది. వరుస ఎన్నికల ముంగిట కమలం పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతుండగా, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్ర వ్యూహకర్త అమిత్ షా అక్టోబర్ 4న రాష్ట్ర పర్యటనకు రానుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైకి ఇది సాధారణ అధికారిక, ప్రైవేట్ కార్యక్రమాల సందర్శనగానే కనిపిస్తున్నప్పటికీ, తెరవెనుక అసలైన పొలిటికల్ ఆపరేషన్‌కు షా శ్రీకారం చుడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది.తెలంగాణలో రానున్న రోజులు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు సగానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకవైపు, త్వరలో రానున్న ఖైరతాబాద్ ఉపఎన్నిక మరోవైపు ముంచుకొస్తున్నాయి. వీటికితోడు గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) సహా వరంగల్, ఖమ్మం వంటి కీలక మున్సిపల్ కార్పొరేషన్ల పోరు కమలనాథుల ముందున్న పెను సవాళ్లు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈ లోకల్ సమరాలే సెమీఫైనల్స్‌‌గా మారనున్నాయి. అందుకే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తుంది.