తెలంగాణ

తాండూరులో ఏసీబీ సోదాల కలకలం.. మైన్స్‌ ఏడీ జయరాజ్‌ ఆస్తులపై మెరుపు దాడులు

ACB Raids: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (మైన్స్‌ ఏడీ) బొజ్జ జయరాజ్‌కు సంబంధించిన ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గురువారం చేపట్టిన మెరుపు సోదాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌ బోడుప్పల్‌, భూపాలపల్లి, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లా తాండూరుతో పాటు జయరాజ్‌కు సంబంధించిన బంధువులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాలు కలిపి మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగాయి.