తెలంగాణ
ఖైరతాబాద్ గణేషుడికి 72 ఏళ్లు.. ఈసారి ఎత్తు 70 అడుగులా? 69 అడుగులా? క్లారిటీ ఇదే!
భాగ్యనగర ఆధ్యాత్మిక ప్రతీక, ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణేశుడి ఉత్సవాలు విశేషంగా సాగుతున్నాయి. ఈ ఏడాది 'శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి' దివ్య రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 1954లో కేవలం ఒక్క అడుగు విగ్రహంతో ప్రారంభమైన ఈ మహోజ్వల ప్రయాణం ఏటేటా శోభిల్లుతూ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, విగ్రహ ఎత్తుపై భక్తుల్లో నెలకొన్న గందరగోళానికి ఉత్సవ సమితి స్పష్టతనిచ్చింది. 1954లో 1 అడుగుతో ప్రారంభమై 2014 నాటికి (60వ ఏట) 60 అడుగులకు చేరిన తర్వాత, ప్రతి సంవత్సరం ఒక అడుగు పెంచే సంప్రదాయాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత నుంచి పర్యావరణ పరిరక్షణ (మట్టి విగ్రహం బరువు), నిమజ్జన ఊరేగింపులో విద్యుత్ తీగలు, మెట్రో లైన్లు వంటి రవాణా సాంకేతిక కారణాల దృష్ట్యా ఎత్తును 60 నుంచి 70 అడుగుల పరిమితిలోనే ఉత్సవ సమితి నిర్ణయిస్తోంది.
