6న కాంగ్రెస్ మహా ధర్నా.. కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేస్తుంటే.. అందుకు కౌంటర్ గా కాంగ్రెస్.. కేసీఆర్ ను టార్గెట్ చేసింది. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ వెయ్యి రోజుల్లో.. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని, ప్రజా సమస్యలపై ఒక్క రోజు కూడా మాట్లాడలేదని, అసెంబ్లీ సమావేశాలకు కూడా రావడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 6న హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నారు.
