తెలంగాణ

1980s రెట్రో ట్రెండ్.. పొంచి ఉన్న సైబర్ ముప్పు

Retro PhotoScam Alert : సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హడావుడి. పాతకాలం నాటి దుస్తులు, వింటేజ్ హెయిర్‌స్టైల్, నాటి బ్లాక్ అండ్ వైట్‌తో కనిపించే '1980s రెట్రో ఫోటో' ట్రెండ్ నెటిజన్లను ఊపేస్తోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరూ తమ ఫోటోలను 80ల నాటి లుక్‌లోకి మార్చుకుని వాట్సాప్ స్టేటస్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లలో తెగ పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సరదా వెనుక డిజిటల్ దొంగలు పన్నిన ప్రమాదకరమైన ఉచ్చు దాగుందని తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పెద్ద బాంబు పేల్చారు.

మనం సరదా కోసం అప్‌లోడ్ చేసే ప్రతి ఫోటో జీవితాంతం ఇంటర్నెట్ డొమైన్‌లోనే ఉండిపోతుందని పోలీసులు గుర్తుచేస్తున్నారు. ఒక్కసారి ఇంటర్నెట్‌లోకి వెళ్లిన ఫోటోపై మనకు ఎలాంటి కంట్రోల్ ఉండదని, అవి సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో మార్ఫింగ్ చేసి అశ్లీల సైట్లలో పెట్టే ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.